ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. భారత్ టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఈజీగా గెలిచే టెస్టులో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. టాపార్డర్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘మ్యాచ్ ఓడినా చాలా గర్వంగా ఉంది. ఐదు రోజుల పాటు కష్టపడ్డాం. చివరి సెషన్, చివరి వికెట్ వరకూ విజయం కోసం పోరాడడం పట్ల సంతోషంగా ఉంది. నేను లక్ష్యంపై చాలా నమ్మకంగా ఉన్నాను. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండటంతో మేం ఛేదిస్తామనుకున్నా. కానీ ఇంగ్లండ్ బౌలర్లు దాడి చేశారు. మా టాపార్డర్‌లో బహుశా రెండు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదైతే ఫలితం మరోలా ఉండేది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మా కంటే బాగా ఆడారు. బ్యాటర్లు క్రీజులో ఉన్నంత సేపు విజయంపై నమ్మకం ఉంది. ఎందుకంటే లక్ష్యం ఏమీ పెద్దది కాదు. 50-60 పరుగుల భాగస్వామ్యం వస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే తెలుసు’ అని అన్నాడు.
‘రవీంద్ర జడేజా చాలా అనుభవజ్ఞుడు. అతనికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోలేదు. టెయిలెండర్స్ సాయంతో ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. తొలి ఇన్నింగ్స్‌లో 80-100 ఆధిక్యం సాధిస్తే మ్యాచులో చాలా కీలకంగా మారేది. ఎందుకంటే ఈ వికెట్‌పై ఐదవ రోజు 150-200 పరుగులను ఛేదించడం అంత సులభం కాదు. 80 పరుగుల ఆధిక్యం ఉంటే మంచి స్థితిలో ఉండేవాళ్లం. కానీ అలా జరగలేదు. నాలుగో రోజు చివర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఆఖరి రెండు వికెట్లు పడాల్సింది కాదు. ఐదవ రోజు ఉదయం ఇంగ్లండ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓ 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్ వచ్చి ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది.ఈ మ్యాచ్‌లో మేం గెలవకపోయినా మంచి క్రికెట్ ఆడామని నేను అనుకుంటున్నాను. సిరీస్ మరింత రసవత్తరంగా ఉంటుంది. బుమ్రా తదుపరి టెస్ట్‌లో ఆడతారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు’ అని గిల్ తెలిపాడు.