India Batting Coach Vikram Rathour Gives Health Update on Shubman Gill: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ‘డెంగ్యూ’ బారిన పడిన విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ వైద్య బృదం చేర్పించింది. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగ్యూ కారణంగా ఈరోజు అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడు ఆడతాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పందించాడు.
ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విక్రమ్ రాఠోడ్ మాట్లాడుతూ… ‘శుభ్‌మన్ గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ఆసుపత్రిలో చేరిన మాట నిజమే. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా కోలుకోవడంతో తిరిగి హోటల్‌కు చేరుకున్నాడు. ఎప్పటికప్పుడు బీసీసీఐ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తూ ఉంది. గిల్ చాలా త్వరగా కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. వాస్తవానికి అతను బాగానే ఉన్నాడు. త్వరలోనే మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పటికే 70-80 శాతం కోలుకున్నాడు. అయితే ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేము’ అని అన్నాడు.
Also Read: Gill-Sara Dating: డోంట్ వర్రీ బేబీ.. సారా టెండూల్కర్ ట్వీట్ వైరల్?
‘శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోయినా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగానే ఉంది. అనుభవం కలిగిన బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు. మైదానంలోకి ఎలా ఆడాలనే స్వేచ్ఛ వారికి ఇచ్చాం. కేవలం ఒక్కరి మీదనే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడదు. గిల్‌కు ప్రత్యామ్యాయ ప్లేయర్స్ ఉన్నారు’ అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ పేర్కొన్నాడు. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ అఫ్గానిస్థాన్‌పై బరిలోకి దిగనున్నాడు. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకోని అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావడం గిల్‌లు కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.