టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. 10 రోజుల వ్యవధిలో సారథిగా శ్రేయస్ మరో ఫైనల్ ఓటమిని చవి చూశాడు. జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ముంబై టీ20 ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా గురువారం ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో శ్రేయస్ కెప్టెన్సీ చేసిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ ఓటమిని ఎదుర్కొంది.
శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీ కారణంగా 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ చేరింది. అయితే ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో 6 రన్స్ తేడాతో ఓడి.. తృటిలో ట్రోఫీ మిస్ అయింది. తాజాగా ముంబై ప్రీమియర్ లీగ్ 2025లోనూ శ్రేయస్‌కు నిరాశే ఎదురైంది. అయితే రెండు ఫైనల్లో శ్రేయస్ విఫమలయ్యాడు. ఐపీఎల్ 2025 ఫైనల్లో 2 బంతులు ఆడిన అతడు 1 రన్ చేసి పెవిలియన్ చేరాడు. ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్లో 17 బంతుల్లో 12 రన్స్ చేసి మరోసారి తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. శ్రేయస్ వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Also Read: END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్ మరో జట్టులో!
ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసింది. మయురెష్ తండెల్ (50 నాటౌట్), హర్ష్ అగవ్ (45 నాటౌట్) రాణించారు. వైభవ్ మాలి రెండు వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. చిన్మయ్ రాజేష్ సుతార్ (53), అవైస్ ఖాన్ నౌషధ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కార్తిక్ మిశ్రా, యష్ డిచోల్కర్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.