గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడి.. కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మార్చి 2025కి గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి మరీ శ్రేయాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ 243 పరుగులు చేసి.. భారత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
Also Read: Robot Dog: ఐపీఎల్‌లో రోబో డాగ్.. అక్షర్, పాండ్యాకు షేక్ హ్యాండ్! వీడియో వైరల్
శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2022లో ఈ అవార్డును అందుకున్నాడు. మూడు సంవత్సరాల అనంతరం (1127 రోజుల తర్వాత) ఈ అవార్డు అందుకున్న మొదటి భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఒకే ఆటగాడు రెండు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంత ఎక్కువ కాలం తర్వాత ఎవరూ అందుకోలేదు. శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా తర్వాత ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న మూడవ భారతీయ ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. మొత్తంగా ఈ అవార్డును గెలుచుకున్న 7వ ఆటగాడు శ్రేయస్. శుభ్‌మాన్ గిల్, బాబర్ అజామ్, కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్, షకీబ్ అల్ హసన్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఈ అవార్డును అందుకున్నారు.