Shreyas Iyer: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కకపోయినా.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సహనంతో ఉంటూ తన ఆటపైనే దృష్టి పెట్టాలని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచించాడు. బెంగళూరులో వర్షం కారణంగా రద్దయిన ఐదో మ్యాచ్‌తో ఈ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలోనూ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్‌లోనే అతను చివరిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పటివరకు ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో ఈ యువ ఆటగాడు 186 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ అంతటా సంజూ శాంసన్, అభిషేక్ శర్మల రూపంలోనే అనుభవజ్ఞులైన ఓపెనర్లపైనే భారత్ భారం మోపింది. సంజూ ఐదు మ్యాచ్‌లలో 168 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 145 పరుగులు జోడించాడు. వీరిద్దరూ చెరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో, వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కడం కష్టంగా మారింది.
ఇక, ఐదో టీ20 ముగిసిన తర్వాత మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. అవకాశాలు రాలేదని ఆందోళన చెందకుండా, సూర్యవంశీ తన ప్రిపరేషన్‌ను నమ్ముకోవాలని, రిలాక్స్‌గా ఉండాలని తాను చెబుతున్నట్లు వివరించాడు. “వైభవ్‌తో నేను నిత్యం చెబుతుంటాను, నీకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. నీ ప్రాసెస్‌లో స్థిరంగా ఉంటూ, మనసును తేలికగా ఉంచుకుని, అవకాశం రాలేదని ఎక్కువగా ఆలోచించవద్దు.. కొన్నిసార్లు వేచి చూడాల్సి ఉంటుంది. మనకు నిలకడగా రాణిస్తున్న ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు” అని కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత ప్రదర్శనపై స్పందిస్తూ.. రెండు, నాల్గవ మ్యాచ్‌లలో బౌలర్లు మరింత ప్రభావవంతంగా రాణించి ఉంటే సిరీస్ ఫలితం వేరేలా ఉండేదని, ఆ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థికి 240కి పైగా పరుగులు సమర్పించుకున్నామని అయ్యర్ చెప్పాడు. బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. వెస్టిండీస్ జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. “మనం బాగా బౌలింగ్ చేసి ఉంటే సిరీస్ స్కోర్‌లైన్ వేరేలా ఉండేది. బ్యాటింగ్ అద్భుతంగా సాగింది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరే కాస్త వెనుకబడ్డాం. క్రెడిట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. షాయ్ హోప్ అయితే సూపర్ అనిపించాడు. ఓటమి తర్వాత కూడా పుంజుకునే సత్తా ఉండటం పెద్ద సానుకూలాంశం. సిరీస్ అంతటా నిలకడగా రాణించలేకపోయాం, కాబట్టి ఇదొక గొప్ప లెర్నింగ్. ఇవాళ కూడా మేము బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో చాలా సవాల్‌తో కూడిన సిరీస్ ఉండబోతోంది” అని ముగించాడు.

