Mangampet Incident: కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెబుతుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగపేటలో నిద్రిస్తున్న 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కువైట్ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య చేసింది తానేనని.. హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్ ఈ వీడియోలో చెప్పాడు. నా కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయానని చెప్పాడు.
Read Also: Shocking Incident: బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..
అసలేం జరిగిందంటే.. ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ.. మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా, పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని తనలో తాను ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ తరువాత వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఇక, వికలాంగుడి హత్యపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం తమకు న్యాయం జరగకనే హత్య చేశానని ఆ వీడియోలో పేర్కొనడం కలకలం రేపుతోంది.
Read Also: Ola Showroom: వింత ఘటన.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసిన కస్టమర్
ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల ఎదుట లొంగిపోవడానికి కువైట్ నుంచి ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియాకు వచ్చారు. కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆంజనేయులును హత్య చేసిన కేసులో నిందితుడు ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియా వచ్చినట్లు తెలిసింది. నిన్న ఉదయం 6:30కు ఇండియాకు వస్తున్నట్లు ఫ్లైట్ టికెట్లను నిందితుడు పోలీసులకు పంపాడు. అయితే మంగళవారమే ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియాకు చేరుకున్నట్లు తెలిసింది ఆంజనేయ ప్రసాద్ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. స్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని ప్రకటించి రెండు రోజులు అవుతున్నా ఇంతవరకు ఆంజనేయ ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.