Shivaji on Currency Note: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై దేవుళ్లు ఫొటోలు ముద్రించాలని చేసిన డిమాండ్స్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకవ్లీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నితీష్ రాణే దీనిపై భిన్నంగా స్పందించారు. మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ చిత్రంతో కూడిన కరెన్సీ ఫొటోను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “యే పర్ఫెక్ట్ హై (ఇది పర్ఫెక్ట్)” అని క్యాప్షన్ పెట్టారు.
రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించిన అర్వింద్ కేజ్రీవాల్.. భారత కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్ చిత్రాలను చెక్కాలని సూచించారు. ఇది ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే మార్గమని ఆయన వాదించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను అదుపులోకి తీసుకురావడానికి కూడా ఇది సహాయపడుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో ఆప్ అధినేతపై బీజేపీ సీనియర్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ తన ప్రభుత్వ లోపాలు, ఆమ్ ఆద్మీ పార్టీ హిందూ వ్యతిరేక ఆలోచనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ రాజకీయ నాటకం ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
UP Minister: మోడీ భగవంతుడి అవతారం.. జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండగలరు
కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు ఆయన యూటర్న్ రాజకీయాలకు పొడిగింపని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరులతో అన్నారు. హిందూ దేవుళ్లను, దేవతలను ఆప్ ‘దుర్వినియోగం’ చేసిందని, అయితే ఇప్పుడు ఎన్నికల ముందు తమ పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ నేత మనోజ్ తివ్రీ అన్నారు. రామమందిరంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారు కొత్త ముసుగు వేసుకుని వచ్చారన్నారు. కేజ్రీవాల్ మహాత్మా గాంధీని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు.