NTV Telugu Site icon

Congress Working Committee: కాంగ్రెస్‌ టాప్‌ బాడీలోకి సచిన్‌ పైలట్, శశిథరూర్‌, రఘువీరారెడ్డి

Cwc

Cwc

Congress Working Committee: త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రకటించారు. ఈ కమిటీలో 39 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ సహా మొత్తం 39 మంది నేతలు ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై ముభావంగా ఉంటున్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు దగ్గడం విశేషం.

Read Also: Himachal Pradesh: వరదలతో హిమాచల్‌ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

ఆగస్టు 20న భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాజీవ్‌గాంధీ జయంతి కావడంతో.. అదే రోజు ఖర్గే వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించడం గమనార్హం. ఈ కమిటీలో కొత్తగా పార్టీ సీనియర్‌ నేతలైన సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, ఆనంద్‌ శర్మ, ఏపీకి చెందిన సీనియర్‌ నేత ఎన్‌ రఘువీరారెడ్డి, పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ తదితరులకు చోటు కల్పించారు. నజీర్‌ హుస్సేన్‌, అల్కా లాంబా, సుప్రియా శ్రీనాథే, ప్రణీతి షిండే, పవన్‌ ఖేహ్రా, గణేశ్‌ గొడియాల్‌, యశోమతి ఠాకూర్‌ పేర్లను కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల జాబితాలో చేర్చారు. సీనియర్‌ నాయకులు వీరప్ప మొయిలీ, మనీశ్‌ తివారీల పేర్లు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. కాగా, మొత్తం 39 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది.

కాంగ్రెస్‌లో అతిపెద్ద నిర్ణయాధికార కమిటీ సీడబ్ల్యూసీ.. చాలా రోజుల కిందే ఏర్పాటు కావాల్సి ఉండగా, అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త కమిటీలో పెద్దగా మార్పులు చేయలేదు. జాబితాను విడుదల చేయడానికి ముందు, గత కొన్ని నెలలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పలుమార్లు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.