Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్

  • రాహుల్‌గాంధీపై చరిత్రకారుడు అనుచిత వ్యాఖ్యలు
  • ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’
  • రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చరిత్రకారుడు రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ప్రధాన పదవికి అర్హుడు కాదంటూ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో అత్యున్నత పదవులను చేపట్టిన నాయకులు ముందుగా పెద్ద ఎగ్జిక్యూటివ్ పదవుల్లో పనిచేయకుండానే ఎదిగారని పేర్కొన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్ర మోడీ ఉదాహరణలను ప్రస్తావిస్తూ గుహకు కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి తగిన అనుభవం కలిగి ఉన్నారా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిపాలనా అనుభవం, విదేశాంగ విధానాలపై అవగాహన వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత నిజాయితీ మినహా రాహుల్‌ను ప్రధాని పదవికి అర్హుడిగా చూపించే అంశాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శశి థరూర్.. గుహ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్ర మోడీ ఏమి అనుభవం ఉందని నిలదీశారు.

×
×
Ad

“రామచంద్ర గుహ గారు.. ఇది కాస్త అతిగా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు బరాక్ ఒబామా కేవలం ఇల్లినాయిస్ నుంచి తొలి టర్మ్ సెనేటర్ మాత్రమే. అప్పటికి ఆయనకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎంత అనుభవం ఉంది? అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి భారత విదేశాంగ సంబంధాలను నిర్వహించేంత అంతర్జాతీయ అనుభవం ఎంత ఉంది?” అని సోషల్ మీడియాలో శశిథరూర్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ గత పన్నెండేళ్లుగా జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని.. పార్టీ లోపల, బయట అనుభవజ్ఞులైన సలహాదారులు కూడా ఉన్నారని చెప్పారు. “ఏ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఒంటరిగా సంక్షోభాలను ఎదుర్కోరు. అందుకే వారికి ప్రభుత్వం, సలహా వ్యవస్థలు ఉంటాయి. ఈ వివాదాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది” అని వ్యాఖ్యానించారు.

రామచంద్ర గుహ ఏమన్నారంటే?


ఈ వారం ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ మాట్లాడుతూ.. సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని చూపించే ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే క్లిష్టమైన పరిస్థితులను సమతుల్యతతో, వివేకంతో ఎదుర్కొగలరని నిరూపించే అంశం ఏమిటి?” అని ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీకి ఉన్న ప్రధాన అర్హత కుటుంబ వారసత్వమేనని, ఆయన తల్లి, తండ్రి, అమ్మమ్మ, ముత్తాత అందరూ ప్రధానమంత్రులుగా పనిచేశారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా మంచి మనిషి కావడం, కుటుంబ నేపథ్యం తప్ప మరే స్పష్టమైన అర్హత కనిపించడం లేదని గుహ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం గుహ-థరూర్ మధ్య జరిగిన ఈ వాదన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంపై, రాహుల్ గాంధీ భవిష్యత్ పాత్రపై మరోసారి రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.