Pakistan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు. రెస్క్యూ 1122 కంట్రోల్ రూమ్‌ను తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పంజాబ్‌లోని సర్గోధా జిల్లా భల్వాల్ తహసీల్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని భల్వాల్ తహసీల్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ తెలియకపోవడం గమనార్హం. గాయపడిన వారిలో ఇద్దరు 4 ఏళ్ల పిల్లలు, కొంత మంది 12 సంవత్సరాల పిల్లలు, 50 ఏళ్ల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఉదయం 8:35 గంటలకు ఈ సంఘటన గురించి తమకు కాల్ అలర్ట్ వచ్చిందని రెస్క్యూ 1122 తెలియజేసింది. ఘటనాస్థలికి తొమ్మిది అంబులెన్స్‌లు, మూడు ఫైర్ ఇంజన్లు, ఒక రెస్క్యూ వాహనాన్ని పంపించారు.
Also Read: Video Viral: పెంపుడు కుక్కలతో కలిసి ధోనీ బర్త్ డే వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో..!
ప్రమాదంపై పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ విచారం వ్యక్తం చేశారు. వ్యాన్ అగ్ని ప్రమాదంపై ఆయన విచారణకు ఆదేశించారు. కమిషనర్, ప్రాంతీయ పోలీసు అధికారుల నుంచి పూర్తి రిపోర్టును కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మొహ్సిన్ నఖ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్‌లో పాకిస్తాన్‌లో జరిగిన మూడు వేర్వేరు గ్యాస్ సిలిండర్ పేలుళ్లలో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం ఐదుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.