తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల పండగ మొదలవనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా.. సర్పంచుల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదోతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాల కోసం జిల్లాల వారీగా నివేదిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామపంచాయితీల పదవీకాలం ఐదేళ్లు. కాగా.. పీరియడ్ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలుండగా.. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి.