Tirupati: తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుతామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: TTD: భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు
తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ వద్ద గల అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడంపై విచారణ కొనసాగుతోందన్నారు. సీసీటివీలో ఓ వ్యక్తి అ టోపీ పెట్టినట్లుగా గుర్తించామని ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.