Site icon NTV Telugu

Sanju Samson: బాబు కెరీర్ క్లోజ్.. ఇక​ ఐపీఎల్‌లో ఆడుకోవడమే! అర్ష్‌దీప్‌ కంటే తక్కువ యావరేజ్

Sanju Samson Trolls

Sanju Samson Trolls

Netizens Trolls Sanju Samson After Poor Show against Windies T20I Series: కేరళ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కువగా అవకాశాలు ఇవ్వదని ఓ అపవాదు ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఇటీవలి కాలంలో శాంసన్‌కు బీసీసీఐ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే సంజూ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్‌ వచ్చిన సంజూ 3 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు సంజూ శాంసన్‌ ఆడాడు. అయితే 3 మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. 12, ​​7, 13 స్కోర్లు చేసి నిరాశ పరిచాడు. ఈ సంవత్సరం సంజూ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతడి టాప్ స్కోర్ 13 పరుగులుగా కావడం గమనార్హం. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఈ అత్యధిక స్కోర్ చేశాడు.

సంజూ శాంసన్‌ 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత.. 5 ఏళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని 2020లో తిరిగి వచ్చి ఆ ఏడాది 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23 పరుగులు మాత్రమే చేశాడు. 2021లో 3 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్కసారి కూడా భారీ స్కోర్ చేయలేకపోయాడు. 2022లో సంజూ 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీ (77) చేశాడు. సంజూ టీ20 కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. 2023లో వరుసగా అవకాశాలు వస్తున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

Also Read: Hardik Pandya: ఓటమి కూడా మంచిదే.. చాలా సంతోషంగా ఉన్నా! హార్దిక్‌ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటివరకు సంజూ శాంసన్‌ తన కెరీర్‌లో 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 18.5 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేశాడు. 22 మ్యాచ్‌లలో 19 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటగలిగాడు. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే.. ఏ జట్టుపైనా అతడు రాణించలేదు. ఐపీఎల్ అంటే రెచ్చిపోయే అతడి బ్యాట్.. టీ20లో మాత్రం మూగబోయింది. తాజా విండీస్ ప్రదర్శనతో ఆసియా కప్‌ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023కు భారత జట్టులో సంజూకు చోటు దక్కే అవకాశం లేదు. దాంతో సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. సంజూ అంతర్జాతీయ కెరీర్‌ క్లోజ్, ఇక ఐపీఎల్‌లో ఆడుకోవడమే మిగిలుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version