NTV Telugu Site icon

Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Sanjay Raut

Sanjay Raut

మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఈ రోజు గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి పని లేదని.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయినా.. దానికి మళ్లీ గుర్తుచేస్తోందన్నారు. ప్రజలు దానిని మర్చిపోయారని.. కానీ దాని ముసుగులో కొందరు నేడు దేశంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.

READ MORE: DGP Dwaraka Tirumala Rao: గంజాయి, ఎర్రచందనంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..

సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఎమర్జెన్సీకి మద్దతిచ్చిన వారిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బాలాసాహెబ్ ఠాక్రే కూడా ఉన్నారు. అదే బాలా సాహెబ్ ఠాక్రే ఫోటో పెట్టి ఓట్లు అడగడం లేదా? బాలాసాహెబ్ అప్పుడు ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. ఎమర్జెన్సీకి మద్దతివ్వడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు బాలాసాహెబ్ ఠాక్రే బలమైన పాత్ర పోషించారు. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో క్రమశిక్షణ తీసుకురావడానికి ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు విశ్వసించారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఆ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. నేడు దేశంలో కేంద్ర ప్రభుత్వ అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయి. ఇది రాజ్యాంగ హత్య కాదా? ” అని ప్రశ్నించారు.