చిన్నారుల ఫిట్‌నెస్, చదువు కోసం జూబ్లీహిల్స్‌లో ‘సీసా స్పేసెస్’ను ఏడాది క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థతో కలిసి భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అడుగు వేయనున్నారు. కొత్త ఏడాదిలో సీసా స్పేసెస్‌తో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు సానియా తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సానియా పాల్గొన్నారు. సీసా స్పేసెస్ భాగస్వాములైన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ… ‘ప్రస్తుతం చిన్నారులు అందరూ ఫోన్స్, టాబ్, టీవీలకు అతుక్కుపోతున్నారు. అన్నం తినాలన్నా.. ఫోన్ లేదా టీవీ తప్పనిసరి అయింది. ఓ తల్లిగా నాకు ఈ సమస్య తెలుసు. చిన్నారులకు చదువు ఒక్కటే కాదు.. మంచి వాతావరణం, ఫిట్‌నెస్, ఆహారం ఎంతో అవసరం. ఈ అంశాల్లో సీసాతో కలిసి నేను చేయనున్నాను’ అని తెలిపారు. శ్రీజ కొణిదెల మాట్లాడుతూ… పిల్లలను తీసుకొని రావడంతో పాటు తల్లిదండ్రులు వారితో కాసేపు సమయాన్ని గడిపేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.