2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. పర్యాటకాన్ని ప్రొమోట్ చేస్తూ.. ప్రపంచం విజయవాడ వైపు చూడాలని ఈ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు’ అని సంయుక్త చెప్పారు.
‘రాజకీయ చైతన్యం కలిగిన నగరం విజయవాడ. పత్రికా రాజధాని విజయవాడ. విజయవాడను విభజిత ఏపీకి రాజధానిగా చంద్రబాబు అప్పుడు చెప్పారు. విజయవాడ చుట్టూ సినీ పరిశ్రమను తిప్పిన వారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కైకాల సత్యనారాయణ’ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ‘ప్రజలందరూ భాగస్వాములు కావాలి. విజయవాడ ఉత్సవ్‌ని సక్సెస్ చేయాలి. మైసూర్‌ను మించి ఈ ఉత్సవ్ ఉండాలని ఆశిస్తున్నాం. వ్యాపార ప్రముఖులు అందరూ ఇందులో భాగస్వాములు కావాలి. విజయవాడ నగర వాసులకు చేతకానిది ఏమీ లేదు. దసరా నవరాత్రులలో విజయవాడ ఉత్సవ్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలి’ అని ఎమ్మెల్యే బొండా ఉమా కోరారు.
‘కర్టన్ రైజర్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. విజయవాడ ఒక వైబ్రెంట్ సిటీ. విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు పది లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. వారెవ్వరూ విజయవాడ వారికి ఉద్యోగాలు కల్పించలేదు. అందరిని ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ వైభవం దేశమంతా తెలిసేలా చేయడానికే విజయవాడ ఉత్సవ్. ప్రతీ సంవత్సరం విజయవాడ ఉత్సవ్ జరుపుతాం. ఇక్కడ నుంచి వలసలు తగ్గి.. విజయవాడలో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఉత్సవ్ వేదిక అవ్వాలి’ అని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.