ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.
‘వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు. దోపిడీ, స్వార్ధం, సొంతం కోసం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దారుణం. సీఎం చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ఉన్న ప్రచారం గుర్తు చేసుకోవాలి. పులివెందుల వంటి కాలేజీలో అడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చినా వద్దని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. మెడికల్ కాలేజీలపై గత ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చుపెట్టింది. కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదు. రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం 6 వేల కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయలేరా?. కమిషన్ల కోసం ఆసుపత్రులను ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకోండి. అంతేతప్ప ప్రజారోగ్యంపై దుష్ట చర్యలు చేయడం కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానం పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
‘యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విశ్లేషణ ఎందుకు చేయడం లేదు. ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చింది. రికార్డుల అధారంగా నిరూపిస్తాం రండి. ఏసీ రూముల్లో కూర్చుని సన్నాయి నొక్కులు, ఏసీ రూముల్లో కూర్చుని కబుర్లు చెబితే సరిపోదు. యూరియా కోసం రైతుల పడుతున్న బాధలను మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. యూరియా కొరతపై మేం మొదటి నుంచి చెబుతున్నాం. రైతు చేయి ఎప్పుడూ పైనే ఉండాలనేది మా ప్రభుత్వం నమ్మింది. అందుకే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్ టైంలో ఇచ్చాం. అన్నీ బ్యాక్ డోర్ విధానాలనే ప్రభుత్వం అవలంబిస్తోంది. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తో కలిసి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also Read: Chinta Mohan: వాట్సప్ పరిపాలన అంటూ.. చంద్రబాబు వాటాల పరిపాలన చేస్తున్నారు!
‘మాట్లాడితే జైల్లో పెడతాం అంటే ఇవాళ పోతే రేపు రాదా. అధికారంలో ఉన్న వాళ్లకు భాష మీద పట్టుండాలి. రుషికొండ మీద పెచ్చు ఊడిందో.. ఊడ గొట్టారో అనే అంశాల జోలికి నేను వెళ్ళను. ఊడిపోయి ఉంటే నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రుషికొండ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించింది ఈ ప్రభుత్వమే. రుషికొండ రిసార్ట్స్ ను ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. రెవెన్యూ రావడం లేదన్నప్పుడు టూరిజం కేంద్రం కనుక పబ్లిక్ ఆక్షన్ చేయవచ్చు కదా, ఇది నా ఉచిత సలహా. ఈ ఏడాదిన్నరలో ప్రైవేట్ హోటళ్లకు ఎంత కట్టారో చూడండి. భూముల్ని నామమాత్రం ధరలకు కేటాయించినప్పుడు రుషికొండ మీద ఎందుకు తాత్సారం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేని యూరియా సమస్య ఏపీలో ఎందుకు వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా డైవర్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీ రైతులు ఏం పాపం చేశారని ఇబ్బందులు పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకుని ప్రైవేట్ పరం చేస్తున్నారు. త్వరలో వాళ్ళ పేర్లన్నీ బయటపెడతాను’ అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.