Sajjala Ramakrishna Reddy: టీడీపీ నాయకులు మరో కొత్త డ్రామాకు తెర లేపారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని, ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రచారం మొదలు పెట్టారని ఆయన అన్నారు. ఈ ప్రచారం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వం స్టెరాయిడ్స్ ఇవ్వాలని చూస్తోందని లోకేష్ ట్వీట్ చేశాడని ఆయన తెలిపారు. ట్వీట్‌లో ప్రస్తావించిన ఇన్ఫెక్షన్లు, దోమలు, స్కిన్ సమస్యలు వంటివి ప్రస్తావించారని.. వీటిలో ప్రాణాంతకం ఏంటో అర్థం కాలేదన్నారు. నిన్నటి వరకు చంద్రబాబును 20 ఏళ్ళ యువకుడు అంటూ కీర్తించారని ఎద్దేవా చేశారు. చేసిన తప్పు మీద మాట్లాడాలన్నారు.
Also Read: CM YS Jagan Vizag Shifting: ఆ తర్వాతే విశాఖకు సీఎం జగన్.. అక్టోబర్ కావొచ్చు.. నవంబర్ కావొచ్చు..!
జైలు ఏమైనా అత్తగారి ఇళ్లా.. ఏసీలు కావాలని అడగటం విచిత్రంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఏకైక హక్కు చంద్రబాబుకే ఉండాలనే విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జైల్లో ఒక కేజీ బరువు పెరిగారు కానీ.. 5 కేజీల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మిగిలిన ఖైదీలు మనుషులు కారా అంటూ సజ్జల ప్రశ్నించారు. అవసరం లేనన్ని సదుపాయాలను కల్పించామన్నారు. స్నేహ బ్యారెక్ మొత్తం ఎందుకు ఖాళీ చేసి చంద్రబాబు కోసమే కేటాయించామని ఆయన పేర్కొన్నారు. బరువు తగ్గారు అంటే ఆయన భార్య భోజనంలో ఏం కలుపుతున్నారో అంటూ ప్రశ్నించారు. ఇంటి దగ్గరి నుంచి వస్తున్న భోజనంలో ఏమైనా కలిపి కొంచెం అనారోగ్యానికి గురయ్యేలా ప్రయత్నం చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఇంటి దగ్గర నుంచి వస్తున్న భోజనాన్ని కూడా పరీక్ష చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Also Read: Yanamala Ramakrishnudu: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత..
తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ విధించిందని సజ్జల తెలిపారు. ప్రత్యేకంగా చంద్రబాబు కోసం వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. లోకేష్ అమిత్ షాను కలవటంపై టీడీపీ రకరకాల డ్రామాలు వేస్తోందన్నారు. చంద్రబాబు అరెస్టు వెనక తాను లేనని వివరణ ఇచ్చేందుకు అమిత్ షానే లోకేష్‌ను పిలిచినంత హడావిడి చేస్తున్నారన్నారు. లోకేష్ ట్విట్లు చూస్తే అమిత్ షా గోడకు తల కొట్టుకుంటారని సజ్జల అన్నారు. పురంధరేశ్వరి చంద్రబాబు ప్రతినిధిగా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఫోటోలో అమిత్ షా రిలాక్స్‌గా కూర్చుని ఉన్నారని.. కాస్త అటెన్షన్ ఇచ్చినట్లు కూర్చుని ఉంటే టీడీపీ ప్రొజెక్షన్ మరో రకంగా ఉండేదని ఎద్దేవా చేశారు. అమిత్ షా స్థాయికి చంద్రబాబు అక్కర లేదు… లోకేషే చాలు అన్నంతగా ప్రచారం చేసి ఉండేవాళ్లని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.