NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: పవన్‌ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: వారాహి యాత్రలో ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. పవన్‌ కల్యాణ్‌ సినీ నటుడు.. అసలు రాజకీయ నాయకుడే కాదు అంటున్నారు.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు.. జగనన్న సురక్ష కార్యక్రమం కింద గవర్నెన్స్ ను ప్రజలకు మరింతగా తీసుకుని వెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు కూడా పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆయన.. టీడీపీకి ఎప్పుడూ ఇలాంటి ఆలోచనే చేయలేదని విమర్శించారు.. చిత్తశుద్ధితో ఉండటం వల్లే ఇలాంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ కార్యక్రమమే చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడడంలేదన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు.

పవన్ కల్యాణ్‌ సినిమా నటుడు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతుంటాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం కోసమే పని చేస్తున్నాడనేది పవన్ మాటలను బట్టి అర్థం అవుతోందన్న ఆయన.. టీడీపీ, పవన్ కల్యాణ్‌.. వాళ్ల మీడియా అజెండా అంతా ఒకే చోట తయారు అవుతుందని విమర్శించారు.. ఒక స్కీం ప్రకారం ఇది జరుగుతోంది.. వ్యక్తిగత సంఘటనలు జరుగుతాయి.. తన హయాంలో దాడులు జరిగినప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర ఒక పోలీసును పెట్టలేను అని చంద్రబాబు చెప్పలేదా? అని ప్రశ్నించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వం మాదన్న ఆయన.. విశాఖ ఎంపీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాను కనుక వ్యాపారాలు వేరే రాష్ట్రంలో చేస్తాను అని అన్నారు.. కానీ, ఈ వ్యాఖ్యలను దిగజారి రూపం మార్చారని ఫైర్‌ అయ్యారు.

ఇక, టీడీపీ బస్సు యాత్రలో నాయకులు ఎవరూ ఉండటం లేదని ఎద్దేవా చేశారు సజ్జల.. మినీ మేనిఫెస్టోతో చంద్రబాబు నవ్వుల పాలయ్యాడన్న ఆయన.. చంద్రబాబు మేనిఫెస్టో అనే మాట మాట్లాడకపోతేనే నయం అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే వాళ్లకే బూమ్ ర్యాంగ్ అవుతుందన్నారు.. చరిత్రలో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు. కానీ, ముద్రగడను ఎవరైనా కంట్రోల్ చేయగలరు అనుకోవటం అమాయకత్వం అవుతుందన్నారు.. మరోవైపు.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారంటూ.. ఏపీ, తెలంగాణలో భూముల ధరలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Show comments