Sahil Chauhan Hits Fastest T20 Century: టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆరు టీ20 సిరీస్‌లో భాగంగా సోమవారం ఎపిస్కోపి వేదికగా సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహిల్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. అంతేకాదు పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ (33 బంతుల్లో) రికార్డును సాహిల్ చౌహాన్ అధిగమించాడు. 2024 ఫిబ్రవరి 27న నేపాల్‌పై జాన్ నికోల్ 33 బంతుల్లో శతకం బాదాడు. 27 బంతుల్లోనే సెంచరీ చేసిన సాహిల్.. జాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్ చరిత్రలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (30 బంతుల్లో) రికార్డును సాహిల్ బ్రేక్ చేశాడు. 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ.. పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో గేల్ సెంచరీ చేశాడు.
Also Read: T20 WC 2024 Super 8: సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా
క్రిస్ గేల్ మరో రికార్డును కూడా సాహిల్ చౌహాన్ బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాది.. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. గేల్ ఓ ఇన్నింగ్స్‌లో (2013 ఐపీఎల్‌లో) 17 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు నాలుగు టీ20లను మాత్రమే ఆడిన చౌహాన్ 162 పరుగులు చేశాడు. అందులో సైప్రస్‌పైనే 144 పరుగులు ఉండడం గమనార్హం.