Ravindra Jadeja About India Plans for Super Eight: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్‌ఏలోని డ్రాప్-ఇన్ పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే విండీస్‌లో ఆడనుంది. విండీస్ పిచ్‌లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తాం అని వారు వెల్లడించారు.
సూపర్-8కు ముందు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో రవీంద్ర జడేజా మాట్లాడుతూ… ‘విండీస్‌లో పిచ్‌లు చాలా నెమ్మదిగా, మందకొడిగా ఉంటాయి. మ్యాచ్‌లు అన్ని ఉదయం కావడంతో స్పిన్నర్లకు అక్కడ మంచి సహకారం లభిస్తుంది. భారత్‌లో మాదిరిగానే విండీస్ పిచ్‌లు స్పిన్ ఫ్రెండ్లీ. మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. స్పిన్నర్లతో డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయించే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు. భారత్ నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పెసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Also Read: Pakistan Team: టీ20 ప్రపంచకప్ కోసం చెత్త జట్టును ఎంపిక చేశారు: పాక్ మాజీ క్రికెటర్
కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ… ‘విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. భారత్ తుది జట్టులో తప్పకుండా నలుగురు స్పిన్నర్లు ఉంటారనుకుంటున్నా. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ చాలా కీలకం. ఏమాత్రం గతి తప్పినా.. బ్యాటర్లు షాట్స్ ఆడేస్తారు. గతేడాది విండీస్‌తో టీ20 సిరీస్ ఆడిన అనుభవం నాకు కలిసొస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ పిచ్‌ల్లో పెద్దగా తేడా లేదని అనుకుంటున్నా’ అని చెప్పాడు. గ్రూప్ దశలో ఆడని కుల్దీప్.. సూపర్-8లో ఆడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 20న అఫ్గాన్‌తో భారత్ తలపడనుంది.