చదువుల మంత్రే లిఫ్ట్ ఇస్తే……..ఆ చిన్నారి విద్యార్థుల ఆనందానికి అవదులే లేవు. మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్ లో వెళ్తుండగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడుగగా వెంటనే వారు సరే అనటంతో వారిని మంత్రి కారులోనే ఎక్కించుకొని,చాక్లేట్లు అందించి,వారి ఇంటి వద్ద డ్రాప్ చేసారు.గొల్లురు నుండి తండా వరకు వారితో మాట్లాడుతూ మంత్రి బాగా చదివి,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రోత్సహించారు.
ఇదిలా ఉంటే.. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హల్ లో 313 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను,80 మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలు,180 మంది మహిళలకు కుట్టు మిషన్లను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ లైట్లు లాంటి కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పహాడి షరీఫ్ లోగల దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం సుమారు 14 కోట్ల నిధులతో దర్గా పైకి రోడ్డు, పార్కింగ్ వసతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో హోం మంత్రి మహమూద్ అలీ మహేశ్వరం లో డీసీపీ, ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, కార్యాలయాలు ఏర్పాటు చేసారన్నారు. డీసీపీ కార్యాలయంకు 3 ఎకరాల భూమి కేటాయించినట్లు.. భవన నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయాలన్నారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సన్నిహితులుగా ఉద్యమ కాలం నుండి మహమూద్ అలీ ఉంటున్నా.. సామాన్యులుగా అందరితో కలిసిపోయి పనిచేస్తూ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారన్నారు.