NTV Telugu Site icon

S.JaiShankar: ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Jaishankar

Jaishankar

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్కడ నిర్వహించిన మీడియా సంస్థ కార్యక్రమంలో మాట్లాడారు.

భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ముఖ్యంగా చాలా దేశాలు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి ఎన్నిక కావడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. 7-8 శాతం వృద్ధి రేటును సాధించడంలో ఇతర దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నందున.. మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే ఉందని జైశంకర్ తెలిపారు. చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయని.. దేశంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

ట్రంప్ విజయంపై..
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంపై జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్‌ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు.