Russia: నిజంగా రష్యా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ‘జపాడ్-2025’ సైనిక విన్యాసాల సందర్భంగా మాస్కో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటైన హైపర్సోనిక్ కింజాల్ క్షిపణిని విజయవంతం పరీక్షించింది. ఈ క్షిపణి వేగం ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ. దీనిని ఆపడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ కథనం ప్రకారం.. ఈ క్షిపణిని రష్యా మిగ్-31 ఫైటర్ జెట్‌లలో అమర్చారు. ఈ విమానాలు బారెంట్స్ సముద్రం మీదుగా నాలుగు గంటల పాటు ప్రయాణించాయి. నేలపైనే కాకుండా ఆకాశంలో, సముద్రంలో కూడా ఎటువంటి సవాలు నుంచైనా తమ క్షిపణులు వెనక్కి తగ్గవని రష్యా ప్రపంచానికి స్పష్టం చేసింది.
READ ALSO: Kantara Chapter 1 : కాంతార 1 కోసం పాట పాడిన సెన్సేషనల్ సింగర్
‘కింజల్’ అంటే..
‘కింజల్’ అంటే రష్యన్ భాషలో కత్తి అని అర్థం. ఈ క్షిపణి అణ్వాయుధ, సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. దీని వేగం, ఎత్తు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న ఏ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా దీనిని పట్టుకోవడం, ఆపడంలో విజయం సాధించడం దాదాపు అసాధ్యం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్షిపణి బలహీనతలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి. పలు నివేదికల ప్రకారం.. కింజల్ 2025లో అనేకసార్లు దాని లక్ష్యాన్ని కోల్పోయింది. దానికి కారణం ఏమిటంటే.. క్షిపణి ఎంత వేగంగా ప్రయాణిస్తే దాని స్థానాన్ని, కోఆర్డినేట్‌లను కచ్చితంగా గుర్తించడం అంత కష్టం అవుతుంది. ఇది ఈ క్షిపణి బలహీనతగా మారిందని పలువురు రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బలహీనతను సద్వినియోగం చేసుకున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుంది. కీవ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW)లను ఉపయోగించి కింజాల్ క్షిపణులను తప్పుదారి పట్టించింది. దీనితో రష్యన్ దాడుల ప్రభావాన్ని ఉక్రెయిన్ తమ భూభాగంలో చాలా వరకు తగ్గించగలింగిందని సమాచారం. EWతో పోరాడటంలో మాత్రమే రష్యా ఇప్పటివరకు $1.5 బిలియన్లకు పైగా ఖర్చును భరించాల్సి వచ్చిందని అంచనా. రష్యా తన క్షిపణులు, డ్రోన్‌లను రక్షించుకోవడానికి CRPA (జామ్-రెసిస్టెంట్ యాంటెన్నాలు)ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ యాంటెన్నాల ధర 10 వేల నుంచి 17 వేల డాలర్ల వరకు ఉంటుంది. వీటిని KAB బాంబులు, షాహెద్ డ్రోన్‌లలో కూడా ఏర్పాటు చేస్తున్నారు.
READ ALSO: Pakistan: లష్కరే తోయిబాకు పాక్ నిధులు.. దాయాది బుద్ధి మారదు..