ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖకు ఊహించని షాక్ తగిలింది. విశాఖలో అత్యంత పర్యాటక ఆదరణ పొందిన రుషికొండ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా రుషికొండకు పేరుంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దు అవ్వడంతో తీరంలో జెండాలను టూరిజం అధికారులు తొలగించారు. పర్యాటక పరంగా గొప్ప అవకాశంగా ఉన్న దీన్ని తొలగించడంతో ఏపీ పరువు మంటగలిసినట్లుయింది.
రుషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా 2020లో గుర్తించారు. డెన్మార్కు చెందిన ఫౌండేషన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన బీచ్‌లు భద్రత, శుభ్రతకు గుర్తింపుగా నిలుస్తాయి. విదేశీ పర్యాటకులు బ్లూ ఫ్లాగ్ తీరాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. ఇటీవల రుషికొండలో నిర్వహణ గాలికి వదిలేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. వాష్ రూమ్స్ కూడా అధ్వాన్నంగా మారాయని ఫిర్యాదులు వెళ్లాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అత్యున్నత ప్రమాణాలు పాటించాలి.