Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాక్షలను భారతీయ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు కదా. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్‌లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ పెరుగుతోంది. అక్కడ ఉన్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా, స్థానిక స్విస్ పౌరులు కూడా యోగా, ఆరోగ్యం కోసం వీటిని స్వీకరిస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
READ ALSO: US-Venezuela War: ఆయుధాలు చేపట్టాలని పిలుపు.. అమెరికా- వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు..
రుద్రాక్ష పూసలకు పెరిగిన డిమాండ్..
స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షలు ఇకపై కేవలం మతపరమైన వినియోగానికి మాత్రమే పరిమితం కాదు. దీనిని “లౌకిక ఆధ్యాత్మికత”కు ఒక రూపంగా, ఆధునిక వెల్నెస్ ధోరణిగా అక్కడి ప్రజలు చూస్తున్నారు. అందుకే అక్కడి ఆన్‌లైన్ యోగా దుకాణాలు, రిటైలర్లు రుద్రాక్ష పూసలను 50 స్విస్ ఫ్రాంక్‌ల (సుమారు రూ.4,650) ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా వీటిని పూజా సాధనంగా మాత్రమే కాకుండా శరీరాన్ని, మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశం – యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA) రుద్రాక్ష వాణిజ్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో భారతదేశం దాదాపు రూ.0.97 కోట్ల విలువైన రుద్రాక్షలను స్విట్జర్లాండ్, ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అక్కడ 27 వేల కంటే ఎక్కువ మంది భారతీయ ప్రవాసులు, అలాగే స్విస్ ప్రజలు వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్న కారణంగా ఈ సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం..
స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షకు ఉన్న డిమాండ్ భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. హరిద్వార్, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని సాంప్రదాయ వ్యాపారులు తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. హిమాలయ రుద్రాక్ష పరిశోధన కేంద్రం వంటి కంపెనీలు నిజమైన రుద్రాక్ష విత్తనాలను సరఫరా చేస్తూ.. వాటి నుంచి తయారైన ఆభరణాలను ఎగుమతి చేస్తున్నాయి. స్విస్ వినియోగదారులు ప్రామాణికతను విశ్వసిస్తూ, ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారని ఎగుమతిదారులు చెబుతున్నారు. అందుకే ఈ మార్కెట్ భారతదేశానికి లాభదాయకంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక ఆధాయ వనరుగా మారింది.