Site icon NTV Telugu

Union Health Minister: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి

Health Minister

Health Minister

Union Health Minister Mandaviya: చైనాతో సహా ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు లేదా పాజిటివ్‌ అని తేలితే క్వారంటైన్‌లో ఉంచుతామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ ఆసియా దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రస్తుత ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి ఎయిర్ సువిధ ఫారమ్ నింపడం కూడా తప్పనిసరి చేయనున్నట్లు ఆయన చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు గతంలో చేసినట్లుగా.. సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదనపు ముఖ్య కార్యదర్శులు, సమాచార కమిషనర్లతో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి మాండవీయ.. దేశం అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిర్వహణ కోసం పూర్తిగా సిద్ధంగా ఉండాలని అన్నారు.

Bharat Jodo Yatra: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్

చైనా, జపాన్, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ వంటి కొన్ని దేశాల్లో ఇటీవలి కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సమక్షంలో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ఈ సమావేశం జరిగింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రాముఖ్యతను మాండవీయ నొక్కి చెప్పారు. అన్ని మౌలిక సదుపాయాల సన్నద్ధతను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని, అవసరమైన మందుల తగినంత స్టాక్ ఉండేలా చూడాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను ఆయన కోరారు.

భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో కొత్తగా 201 మందికి కొవిడ్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజే 183 మంది కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Exit mobile version