పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్‌లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతిలోని ధర్మం, విలువలను ప్రస్తావించిన మోహన్ భగవత్.. రామాయణంలో రావణుడు ఎలాగైతే చివరి వరకూ మారలేదో.. అలాగే కొందరు దుర్మార్గులు మారరని ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాముడు రావణుడికి అవకాశం ఇచ్చిన తిరస్కరించాడని తర్వాతే రాముడు అతన్ని చంపాడని చరిత్ర గుర్తు చేశారు.
READ MORE: Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్
పాకిస్థాన్‌కు సైతం ఎన్నో అవకాశాలు ఇచ్చాం.. వారు మారలేదు.. అలాంటి వారు నశించాల్సిందే అంటూ ఆగ్రహానికి గురయ్యారు. భద్రత పై ప్రజలకు అంచానాలున్నాయని.. అవి నెరవేరుతాయన్నారు. ధర్మం అంటే సత్యం, న్యాయం, మానవతా విలువలు.. ఇవి ఎవరికైనా వర్తిస్తాయని వెల్లడించారు. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతిని భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి చీకటి శక్తులపై ధర్మం గెలవాల్సిందేనన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్లను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి విషాదాలను నివారించడానికి, దురుద్దేశాన్ని అరికట్టడానికి సమాజంలో ఐక్యత చాలా అవసరమని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి గుర్తు చేశారు. “మనం ఐక్యంగా ఉంటే, ఎవరూ మనల్ని దురుద్దేశంతో చూసే ధైర్యం చేయరు. ఎవరైనా అలా చేస్తే.. వారి కళ్లు పేలిపోతాయి.” అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.