Rangareddy Land Records AD Srinivas Arrested by ACB: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా వచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు గురువారం తెల్లవారుజామున ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శ్రీనివాస్ ఇల్లు, బంధువుల నివాసాలు, ఆయన పేరుతో గుర్తించిన పలు స్థలాలు పరిశీలించిన ఏసీబీ, కీలక పత్రాలు, ఆస్తుల ఆధారాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో విలువైన ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో మరొక 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో 4 ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాల స్థలం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అదనంగా సోదాల్లో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, రెండు కార్లకు సంబంధించిన పత్రాలు కూడా దొరికాయి. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ అధికారలు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు పంపించారు.