ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగొంచి.. శుభ్‌మన్ గిల్‌ను సారథిగా ఎంపిక చేశారు. బీసీసీఐ నిర్ణయం క్రికెట్ ప్రపంచంను ఆశ్చర్యంకు గురిచేసింది. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలుచుకుంది. ఫైనల్లో హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రోహిత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌కు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం క్రికెట్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ సందర్భంగా రోహిత్ శర్మ అభిమానులతో మాట్లాడాడు. 2023లో మీ కళ తృటిలో చేజారింది, 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉండి మీ కళను నెరవేర్చుకుంటారా? అని విమల్ అడిగినప్పుడు హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘అవును, 2027 ప్రపంచకప్ ఖచ్చితంగా నా మనసులో ఉంది. 2023లో ఏదైతే నెరవేరలేదో, నేను దానిని 2027లో నెరవేర్చగలిగితే సంతోషంగా ఉంటుంది’ అని రోహిత్ అన్నాడు. ఇప్పుడు రోహిత్ టీమిండియాకు కెప్టెన్‌గా లేడు కాబట్టి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రోహిత్ ఇప్పుడు కెప్టెన్ కాదు. కానీ అతను 2027 ప్రపంచకప్‌ను ఆటగాడిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘రోహిత్ శర్మను కెప్టెన్‌గా మిస్ అవుతున్నా’ అం మరో అభిమాని పేర్కొన్నాడు.
Also Read: INDW vs PAKW: సేమ్ సీన్ రిపీట్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో నో హ్యాండ్‌షేక్!
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతడు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. 2027 ప్రపంచకప్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే హిట్‌మ్యాన్ మెగా టోర్నీలో ఆడడం ఇప్పుడు అనిశ్చితంగా మారింది. మరో రెండేళ్ల పాటు వన్డేల్లో మాత్రమే ఆడుతూ కుర్రాళ్ల నుంచి పోటీని తట్టుకుంటూ.. ఫామ్ నిరూపించుకుంటూ, ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు మంచి రికార్డ్ ఉంది. 2024 టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విజేతగా నిలిపాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్ కప్ అందించాడు.