Rohit Sharma Clicks Selfie with Fans: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు అందరూ శ్రీలంక నుంచి స్వదేశానికి చేరుకొన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంటికి రాగానే.. అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆసియా కప్ 2023 అనంతరం రోహిత్ శర్మ శ్రీలంక నుంచి నేరుగా ముంబైలోని తన స్వగృహానికి చేరుకొన్నాడు. రోహిత్ స్వయంగా కారు నడుపుకుంటూ బయటికి వస్తున్న సమయంలో అభిమానులు సెల్ఫీ కోసం అతడిని చుట్టుముట్టేశారు. దాంతో కారు లోంచి దిగిన రోహిత్.. అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. ఒక్కో అభిమానితో భారత కెప్టెన్ ఫొటోస్ దిగాడు. అంతేకాదు పహారా కాస్తున్న పోలీసు అధికారి కూడా సెల్ఫీ కోరగా.. రోహిత్ అతడితో కూడా ఫొటో దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతిని ఇచ్చారు. వీరందరూ మూడో వన్డేలో అందుబాటులో ఉంటారు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఆసీస్ సిరీస్ అనంతరం వన్డే ప్రపంచకప్ 2023 కోసం జరిగే ప్రాక్టీస్ మ్యాచులలో భారత ప్లేయర్స్ ఆడుతారు. భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ఆరంభం కానుంది.