పలువురు భారత్ క్రికెట్ కామెంటేటర్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో కామెంటేటర్లు ఎదో ఒక ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుందన్నాడు. ఇతర దేశాల కామెంట్రీ ఒక్కోసారి బాగుంటుందని, భారత్‌లో క్రికెట్ జర్నలిజం తీరు మారాల్సిన అవసరం ఉందన్నాడు. మ్యాచ్ గురించి మాట్లాడటం తక్కువైందని.. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకే క్రికెటర్‌పై దృష్టిపెట్టి, అతడి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడం తగదని హిట్‌మ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా టెస్టు క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘కొందరు భారత్ క్రికెట్ కామెంటేటర్లు కేవలం వివాదాలను సృష్టించడంపై దృష్టి పెట్టారు. అసలైన వార్తలను వారు పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో నాణ్యమైన జర్నలిజం తగ్గిపోయింది. గతంలో మొత్తం క్రికెట్ పైనే కామెంట్రీ జరిగేది. ఇప్పుడు మాత్రం అలా కేసు. వ్యూస్, లైక్‌లు, స్టోరీలను ఎక్కువ మంది చదివేందుకు ఇతర వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారు. మ్యాచ్ గురించి రాయడం, మాట్లాడటం తక్కువైంది. వ్యూహాలు, విశ్లేషణ మాట్లాడం లేదు. ప్రస్తుత రోజుల్లో టీవీల్లో మ్యాచ్ చూస్తే.. కామెంటేటర్ల మాటలు వింటే చాలా నిరుత్సాహంగా అనిపిస్తోంది. విదేశాల్లో కామెంట్రీ భిన్నంగా ఉంటుంది. క్వాలిటీ కూడా సూపర్. మన దగ్గర అలా ఉండదు’ అని అసహనం వ్యక్తం చేశాడు.
Also Read: PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్!
‘భారత్‌లో ఏదొక ప్లేయర్‌ను తీసుకొని అతడి పైనే ఎక్కువగా కామెంట్రీ చేస్తారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తారు. చాలా మంది ఫాన్స్ క్రికెట్ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు. అభిమానులకు కామెంటేటర్ల మసాలా? అవసరం లేదు. ఓ ప్లేయర్ ఎందుకు ఆడడం లేదు, ఎందుకు ఫామ్ కోల్పోయాడు?, ఏం తప్పులు చేస్తున్నాడు? అనేవి చూస్తారు. ఫాన్స్ ఎప్పుడూ ప్లేయర్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అనుకోరు. మన కామెంటేటర్లకు మాత్రం మసాలా కావాలి. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వండి. ఒక్కోసారి మేం మంచి ప్రదర్శన ఇవ్వలేకపోవచ్చు, అప్పుడు విమర్శలు చేయండి. న్యూజిలాండ్‌పై బాగా ఆడలేకపోయాం కానీ.. అందుకూ ఓ విధానం ఉంటుంది. ఓ ఎజెండాతో విమర్శలు చేయొద్దు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.