Site icon NTV Telugu

Rohit-Kohli: అన్ని ఊహాగానాలకు చెక్.. 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ!

Virat Kohli Rohit Sharma

Virat Kohli Rohit Sharma

టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెక్ పెట్టాడు. ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీలు ఆడుతారని హింట్ ఇచ్చాడు.

ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించిన బీసీసీఐ.. శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. 2027 ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. దాంతో రోహిత్, విరాట్ కోహ్లీలు వన్డే ప్రపంచకప్ ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్‌కు ముందు గిల్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడబోతున్నారని చెప్పకనే చెప్పాడు. వారి అనుభవం, నైపుణ్యాలు జట్టుకు చాలా ముఖ్యం అని అన్నాడు.

Also Read: Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!

‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం, నైపుణ్యం చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లలో విజయాలు అందించారు. వారి సామర్థ్యం, అనుభవం జట్టుకు చాలా అవసరం. ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడానికి పూర్తి అర్హులు. నేను రోహిత్ భాయ్ నుంచి చాలా నేర్చుకున్నాను. అతని ప్రశాంతత, జట్టులో సృష్టించే స్నేహ వాతావరణం నాకు స్ఫూర్తిదాయకం. నేను దానికి కొనసాగిస్తా’ అని శుభ్‌మన్ గిల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉంది. కానీ రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు జట్టుకు కీలకంగా ఉంటారు. ప్రధాన టోర్నమెంట్లలో ముఖ్యంగా ప్రపంచకప్‌లో వారి అనుభవం కీలకం అవుతుంది. అందుకే 2027 ప్రపంచకప్ వరకు ఇద్డు దిగ్గజాలు ఆడే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version