దొంగలు రెచ్చిపోతున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు దొంగల (Thiefs) బెడదతో కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. రాజోలు పరిసర ప్రాంతాల ప్రజలు ఊళ్ళకు, వివిధ పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రాజోలు దీవిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్న దొంగల తీరుపై జనం మండిపడుతున్నారు. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలకు పండుగే. తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించి తాళాలు పగలగొట్టి దొంగతనాలు పాల్పడుతున్నారు దొంగలు. రాజోలు, పొదలాడ, తాటిపాక, నగరం గ్రామాల్లో పలు ఇళ్లలో దొంగతనాలు చేస్తూ అందినకాడికి దొచుకెళుతున్నారు ఘరానా దొంగలు.
నగరం కోకో కోలా హోల్ సేల్ దుకాణంలో గత అర్థరాత్రి బ్యాక్ సైడ్ షట్టర్ పగలగొట్టి విలువైన వస్తువులు, కొంత నగదు దోచుకు పోయారు దొంగలు. కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం పోలీసులు. గత కొంతకాలంగా పోలీసులు నైట్ బీట్ వేయక పోవడం వల్లనే దొంగతనాలు ఎక్కువయ్యాయని స్థానికుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పసికందును అపహరించే యత్నం
చిన్నపిల్లల్ని ఎత్తుకునిపోయే ముఠాల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందును అపహరించేందుకు యత్నించింది ఓ మహిళ. బంధువులు అప్రమత్తం కావడంతో మహిళ పరారీకి ప్రయత్నం చేసింది. సెక్యూరిటీ సాయంతో ఆ మహిళను పట్టుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. ఆస్పత్రుల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Tamilnadu Rains: పొంగిపొర్లుతున్న డ్యామ్‌లు, నీటమునిగిన వీధులు.. తమిళనాడును ముంచెత్తిన వర్షాలు