Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..

Rishabh Pant Captain

Rishabh Pant Captain

Rishabh Pant: టీమిండియా వికెట్‌కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల భారీ ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్‌కు వెళ్లిన పంత్, కేవలం పదేళ్ల కాలంలో శ్రమతో రూ. 120 నుంచి 150 కోట్ల నెట్ వర్త్ స్థాయికి చేరుకోవడం విశేషం.

పంత్ ఆదాయంలో ప్రధాన వాటా ఐపీఎల్ ద్వారా వస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకోగా, రెండు సీజన్ల పాటు ఇదే భారీ జీతంతో ఆడాడు. దీనికి తోడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ‘గ్రేడ్-బి’ ప్లేయర్‌గా ఏడాదికి రూ. 3 కోట్ల స్థిర ఆదాయంతో పాటు ప్రతి టెస్ట్ మ్యాచ్‌కి రూ. 15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు పొందుతున్నాడు. ఆటతో పాటు ప్రకటనల ద్వారానూ పంత్ భారీగా ఆర్జిస్తున్నాడు. అడిడాస్, డ్రీమ్ 11, బోట్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఏడాదికి రూ. 8 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. షూటింగ్స్ కోసం రోజుకు రూ. 2.5 కోట్లు, రెండు రోజుల ఈవెంట్లకు రూ. 4.5 నుంచి 4.75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఉన్న కోట్లాది మంది ఫాలోవర్ల ద్వారా స్పాన్సర్డ్ పోస్టులు చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. కోట్ల ఆదాయంతో పాటు పంత్‌కు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఢిల్లీ, డెహ్రాడూన్, రూర్కీలలో అతనికి అత్యంత విలువైన ఆలీషాన్ ఇళ్లు ఉన్నాయి. అతని గ్యారేజీలో రూ. 1.32 కోట్ల విలువైన ఆడి A8, రూ. 2 కోట్ల ఫోర్డ్ ముస్తాంగ్, రూ. 2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ GLE వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితో పాటు వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ జట్టుకు పంత్ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు.