Rishabh Pant About Suryakumar Yadav Catch: గత జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో ప్రొటీస్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పట్టాడు. అక్కడే మ్యాచ్ మలుపుతిరిగింది. అయితే కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్ మాత్రం మిల్లర్ కొట్టిన షాట్ సిక్స్‌గానే భావించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సూర్య సూపర్ క్యాచ్ పట్టినా.. అదంతా భారత క్రికెట్ అభిమానుల ప్రార్థనల వల్లే సాధ్యమైందని పంత్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఆడుతున్న రిషబ్ పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడాడు. గాల్లోకి బంతి లేచినప్పుడు అందరూ సిక్సర్ వెళుతుందనుకున్నారు. వికెట్ల వెనకాల ఉన్న నేను కూడా అలానే భావించా. అద్భుతంగా పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య భాయ్ బాల్‌ను పట్టేశాడు. బంతి బౌండరీ లైన్‌ను తాకలేదు. ఇదంతా భారత అభిమానుల ప్రార్థనల ఫలితమేనని నేను భావిస్తున్నా. ప్రపంచకప్ విన్నింగ్ జట్టులో ఉండాలనేది ప్రతి క్రికెటర్ కల. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకుంటున్న సమయంలో నేను కూడా ప్రపంచకప్ జట్టులో ఉంటే బాగుంటుందనుకున్నా. దానికోసం తీవ్రంగా కష్టపడ్డా’ అని చెప్పాడు.
Also Read: Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌కు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్!
‘రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి వచ్చాక నేరుగా ప్రపంచకప్‌ను గెలవడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు నేను ప్రపంచకప్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఏ ప్లేయర్ అయినా 2-3 వారాలు మాత్రమే ఆ సంబరాలను గుర్తుపెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆటపై దృష్టి పెడతాడు కానీ.. ఆ మధుర క్షణాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. ప్రపంచకప్ మధుర క్షణాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి’ అని పంత్ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించగా.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి పంత్ పునరాగమనం చేయనున్నాడు. పంత్ చివరిసారిగా 2022లో టెస్టు మ్యాచ్ ఆడాడు.