బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహంపై ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధూమ్’, ‘గరం మసాలా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమీ, తన సహనటుడు జాన్ నటనపై అస్సలు గౌరవం లేదని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. జాన్ అబ్రహంకు నటన సరిగ్గా రాదని, ఆయన కేవలం తన కండలు, బాడీని చూపించి ఇన్నాళ్లు బాలీవుడ్‌లో స్టార్‌గా నెట్టుకొచ్చాడని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి మరో బిగ్ ట్రీట్..
రిమీ సేన్ మాట్లాడుతూ ‘జాన్‌కు తన లిమిటేషన్స్ (పరిమితులు) ఏంటో బాగా తెలుసు. అందుకే అతను తన లుక్స్‌ని, ఫిజిక్‌ని నమ్ముకుని కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితమయ్యాడు. గొప్పగా నటించడం రాదు కాబట్టే గంభీరమైన పాత్రలు, బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథలను ఎంచుకుంటూ తన లోపాలను కప్పిపుచ్చుకుంటున్నాడుట’ అని ఘాటుగా విమర్శించారు. ఒక నటుడిగా కంటే తన ఇమేజ్‌ను మార్కెట్ చేసుకోవడంలోనే ఆయన సిద్ధహస్తుడని ఆమె తెలిపింది. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న రిమీ సేన్, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఈ విషయంలో జాన్ అబ్రహం అభిమానులు సోషల్ మీడియాలో రిమీపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, మరికొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఈ సంచలన విమర్శలపై యాక్షన్ హీరో జాన్ అబ్రహం ఏ విధంగా స్పందిస్తారో అని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.