Site icon NTV Telugu

Revanth Reddy-PM Modi: జాతీయ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ లేఖ!

Revanth Reddy Letter

Revanth Reddy Letter

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేయకూడదని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ తన లేఖలో మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే, దేశమంతా స్వాగతిస్తుందని తెలిపారు. ఈ అంశాన్ని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆందోళనలు వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రక్రియ తాత్కాలికంగా కొన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి లాభం చేకూర్చవచ్చని.. కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని తెలిపారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. లోక్‌సభ డీలిమిటేషన్ విషయంలో కేవలం జనాభా నిష్పత్తి ఆధారిత విధానాన్ని కాకుండా.. ఇతర ప్రత్యామ్నాయ నమూనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.

Exit mobile version