NTV Telugu Site icon

Revanth Reddy: ప్రగతి భవన్‌ కాదు.. డా.అంబేడ్కర్‌ ప్రజాభవన్‌గా పేరు మార్పు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: కాంగ్రెస్ విజయం ఖరారైన అనంతరం టీపీసీసీ చీఫ్ కీలక ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. డిసెంబర్‌ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని ఆయన అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. . రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను పెంచారు.. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ స్ఫూర్తిని నింపారు.. నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం.. పార్టీ సీనియర్‌ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది.. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది.. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తాం.. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం.. ప్రతిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం.” అని ఆయన పేర్కొన్నారు.

Read ALso: CM YS Jagan: అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ. “మా కూటమి ఎన్నికల్లో గెలిచింది.. ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ప్రగతి భవన్‌ డాక్టర్‌అంబేడ్కర్ ప్రజాభవన్‌గా మారుతుంది.. సామాన్యులందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. సచివాలయం గేట్లు కూడా అందరికి తెరుచుకుంటాయి.” అని రేవంత్ స్పష్టం చేశారు. ఏ సమస్యలు వచ్చినా సహకరించిన రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారన్నారు. రాహుల్ గాంధీ గారి అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌ రావు థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంలో తన పాత్ర పోషించిన విజయశాంతికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్‌ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారన్నారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని రేవంత్‌ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందన్నారు. ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.