Redmi A3 Smartphone Released in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసిన రెడ్‌మీ.. తాజాగా ఓ కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్‌మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్‌మీ ఏ3ని బుధవారం (ఫిబ్రవరి 14) భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Redmi A3 Price:
రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.7,299గా ఉంది. 4జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.8,299గా ఉండగా.. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,299గా ఉంది. రెడ్‌మీ ఏ3 మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ విక్రయాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఐ.కామ్, షావోమీ రిటైల్ స్టోర్లలో సహా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.
Also Read: Asus ROG Zephyrus Laptop: ఆసుస్ నయా గేమింగ్ ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Redmi A3 Features:
రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.71 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటును అందించారు. వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది.
Redmi A3 Camera and Battery:
రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 12 జీబీ వరకు పెంచుకునేలా వర్చువల్ ర్యామ్ సదుపాయం ఉంది. 4జీ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, సైడ్‌మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది.