Tirumala Darshanam Record: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లమంది తిరుమలకు వెళ్తుంటారు. శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు, కానుకలు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు. ప్రతిరోజు తిరుమలలోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం రికార్డుస్థాయిలో 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్ష ఫలితాల విడుదల నేపథ్యంలో భారీగా తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఈవో ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో స్వామివారి అభిషేక సేవ పూర్తి అయ్యే సరికి గంటన్నర సమయం ఆదా అయింది. ఈ గంటన్నర సమయాన్ని భక్తుల సర్వదర్శనం కోసం టీటీడీ కేటాయించింది. దీనితో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం రోజున శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలు దాటింది. వేసవిలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని గురువారం తిరుప్పావడ సేవను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడి నిర్ణయించింది.
Read Also: Karnataka CM: నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం.. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
ఇదిలా ఉండగా ఇవాళ.. స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చింది.