RCB Enters WPL 2024 Final after Beat MI in Eliminator: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకెళ్లింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్‌సీబీ తలపడుతుంది. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ఆర్‌సీబీ.. ఈసారి మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుకు బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఆర్‌సీబీకి మంచి ఆరంభం దక్కలేదు. వరుస ఓవర్లలో సోఫీ డివైన్ (10), స్మృతి మంధాన (10) ఔట్ కాగా.. కాసేపటికే దిశా కాసెట్ (0) కూడా పెవిలియన్ చేరింది. ఈ సమయంలో ఎలీస్ పెర్రీ (66; 50 బంతుల్లో 8×4, 1×6) జట్టును ఆదుకుంది. రిచా ఘోష్ (14)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేసింది. అయితే రిచాను హేలీ అవుట్ చేయడంతో ఆర్‌సీబీ 9.1 ఓవర్లలో 49/4తో కష్టాల్లో పడింది. మోలనూ (11), జార్జియా (18 నాటౌట్) తోడుగా పెర్రీ జట్టు స్కోరు పెంచింది. ఈ క్రమంలోనే 40 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకుంది. చివరి బంతికి సిక్స్ బాదిన జార్జియా.. జట్టు స్కోరును 130 దాటించింది. ఢిల్లీ బౌలర్లు హేలీ (2/18), నాట్ సీవర్ (2/18), ఇషాక్ (2/27) తలో రెండు వికెట్స్ తీశారు.
Also Read: Election Code: నేడే ఎన్నికల కోడ్ అమలు.. షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ..
లక్ష్య ఛేదనలో ముంబై ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. హేలీ (15) ఆరంభంలోనే అవుట్ అయింది. యాస్తిక (19), సీవర్ (23) కాసేపు క్రీజులో ఉన్నా.. కొద్ది తేడాతో ఇద్దరు అవుట్ అయ్యారు. అప్పటికి ముంబై స్కోర్ 10.4 ఓవర్లలో 68/3గా ఉంది. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (33; 30 బంతుల్లో 4×4), అమేలియా (27 నాటౌట్)తో కలిసి స్కోరు పెంచింది. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో సమీకరణం 24 బంతుల్లో 32గా మారింది. అయితే వరుస ఓవర్లలో హర్మన్, సజన (1) ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతులకు 4 పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి పూజ (4) ఔట్ అయింది. ఆ తర్వాతి రెండు బంతులకు రెండే పరుగులు రావడంతో ముంబై ఓటమిపాలైంది.