సోమవారం వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6)లు అర్ధ సెంచరీలు చేశారు. ఛేదనలో ముంబై 9 వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఆర్సీబీ బౌలర్లు కృనాల్ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37), యశ్ దయాళ్ (2/46) రాణించడంతో సొంత మైదానంలో ముంబైకి ఓటమి తప్పలేదు. ఈ అద్భుత విజయంతో ఆర్సీబీ ఓ అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుత విజయాలు అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ లాంటి పటిష్ట జట్లపై వాటి సొంత మైదానాల్లో విజయాలు సాధించింది. చెన్నై, ముంబై, కోల్‌కతా టీమ్స్ ఎక్కువ ట్రోఫీలు అందుకున్న జట్లు మాత్రమే కాదు.. ఒకే వేదికపై అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్లు కూడా. అలాంటి జట్లపై, అందులోనూ వాటి సొంత మైదానంలోనే ఈ ఏడాది బెంగళూరు అద్భుత విజయాలు అందుకుంది.
2015 తర్వాత వాంఖడే మైదానంలో ముంబైపై బెంగళూరు గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 10 ఏళ్ల తర్వాత వాంఖడేలో ఆర్సీబీ గెలుపొందింది. చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత చెన్నైపై విజయం సాధించింది. ఐపీఎల్ ఆరంభం సీజన్లో చెపాక్‌లో బెంగళూరు గెలుపొందింది. అప్పటినుంచి చెపాక్‌లో ఆర్సీబీకి విజయమే లేదు. ఎట్టకేలకు 2025లో చెన్నైని చిత్తు చేసింది. ఇక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతాపై 5 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ క్రెడిట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌కు దక్కింది.