Reserve Bank Of India: నిత్యావసర ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యులపై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంటుందని తెలుస్తోంది. ఈనెల 30న ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేట్లను ఆర్‌బీఐ పెంచనుంది. ఇప్పటికే గత రెండు సమీక్షల్లో వరుసగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచింది. ఇదే జరిగితే ప్రజలు తీసుకున్న అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి.
ఎందుకంటే రెపో రేట్లు పెరగడం వల్ల బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్, హోం లోన్, వెహికల్ లోన్‌లకు సంబంధించి వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో వినియోగదారులు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది. ఈనెల 30న ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో 35 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోసారి రెపో రేట్లు పెరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు సామాన్యులపై అదనపు భారం తప్పదు. రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.