అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు.
గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల ఇళ్లను అన్నమయ్య జిల్లా పోలీసులు తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు, వాకీటాకీలు, రేడియోలు, రిమోట్లు వంటి పరికరాలతో పాటు పలు పాస్ పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
Also Read: Kurnool Diamond: వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే
పట్టుబడిన అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీల సెల్ఫోన్ల ఆధారంగా వారితో తరచుగా మాట్లాడేవారు, కలిసి తిరిగిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఓ వ్యాపారితో పాటు ఓ ప్రజాప్రతినిధితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఈ ఇద్దరూ తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి ఇద్దరు పన్నాగం పన్నారు. వీరిద్దరూ తమిళనాడు నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. 13 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉంటూ వస్త్ర వ్యాపారం ముసుగులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారు.