ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది. ఈ డీల్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. చెన్నైని వీడుతున్నాడనే ఊహాగానాల వేళ జడేజా ఇన్స్టాగ్రామ్ ఖాతా అదృశ్యం అయింది.
రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సోమవారం అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఏ కారణం వల్ల అకౌంట్ కనిపించకుండా పోయిందో ఇంకా తెలియలేదు. జడేజా స్వయంగా తన ఖాతాను డీయాక్టివేట్ చేశాడా లేదా మరేదైనా సాంకేతిక కారణం ఉందా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ.. అతని ఐపీఎల్ కెరీర్ గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జడేజాను వదులుకునేందుకు సిద్ధమైందని వస్తున్న వార్తలకు ఇది బలం చేకూరినట్లైంది. జడ్డు జట్టు మారనుండటం ఖాయంగా కనిపిస్తోంది. సంజు కోసం సీఎస్కే జడేజా లేదా సామ్ కరన్‌లను వదులుకునేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Car Sales: తగ్గిన క్రెటా, బ్రెజా హవా.. జనాలు ఈ ఎస్యూవీ కోసం ఎగబడుతున్నారు!
రవీంద్ర జడేజా 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 19 ఏళ్ల వయసులో ఆడాడు. తొలి సీజన్లో రాజస్థాన్ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. 2010లో కాంట్రాక్టు నియమాలను ఉల్లంఘించినందుకు జడేజాపై ఒక సంవత్సరం సస్పెన్షన్ విధించబడింది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. చెన్నై గెలిచిన ఐదు ఐపీఎల్ టైటిళ్లలో మూడింటిలో జడేజా కీలక పాత్ర పోషించాడు. 2022లో అతనికి జట్టు కెప్టెన్సీ కూడా ఇవ్వబడింది. కానీ పేలవమైన ప్రదర్శన కారణంగా సీజన్ మధ్యలో ఆ బాధ్యతను వదులుకున్నాడు. జడేజాను ఐపీఎల్ 2025 కోసం చెన్నై రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. 36 ఏళ్ల జడేజా ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 3260 పరుగులు, 170 వికెట్లు పడగొట్టాడు. సీఎస్కే తరఫున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (152) జడ్డు. 2023 ఐపీఎల్ ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.