దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాపార రంగంలోనే కాకుండా.. క్రీడాకారులకూ అండగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి టీమిండియా క్రికెటర్లకు సాయం చేశారు. క్రికెటర్లకు అండగా నిలిచేందుకు తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చారు. టాటా పవర్స్, టాటా స్టీల్స్, టాటా ఎయిర్‌లైన్స్ విభాగాల్లో పలువురు భారత క్రికెటర్లకు ఉద్యోగావకాశాలను కంపెనీ కల్పించింది. అంతేకాదు వారికి స్పాన్సర్ చేస్తూ ప్రోత్సహించింది.
టాటా గ్రూప్ నుంచి చాలా మంది భారత క్రికెటర్లు సాయం అందుకున్నారు. ఈ జాబితాలో అలనాటి క్రికెటర్లు సహా.. ప్రస్తత క్రికెటర్లు కూడా ఉండడం విశేషం. మాజీలు ఫరూఖ్ ఇంజినీర్, మొహిందర్ అమర్నాథ్, అజిత్ అగార్కర్, సంజయ్ మంజ్రేకర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, జవగల్ శ్రీనాథ్, మొహమ్మద్ కైఫ్‌కు తమ గ్రూప్‌లో ఉద్యోగాలు కల్పించింది. ఈ తరంలో శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ ఉన్నారు.
Also Read: Harmanpreet Kaur: మా లక్ష్యం విజయం మాత్రమే కాదు: హర్మన్‌ప్రీత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు టాటా స్పాన్సర్‌షిప్ చేస్తోంది. వివో, బీసీసీఐ మధ్య వివాదం తలెత్తడంతో.. స్పాన్సర్‌గా ఎవరు వస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ సమయంలో టాటా నేనున్నానంటూ ముందుకొచ్చింది. టైటిల్ స్పాన్సర్‌గా 4 ఏళ్ల కాలానికి ఏకంగా రూ.2,500 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్‌కు టాటానే స్పాన్సర్. మహిళల ప్రీమియర్ లీగ్‌కు సైతం టాటానే స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 1996లో, 2000లో భారత జట్టుకు టాటా గ్రూప్ అండగా నిలిచింది.