NTV Telugu Site icon

Rashid Khan: ఆసియా కప్‌ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ నిష్క్రమణ.. రషీద్ ఖాన్‌ ఎమోషనల్ పోస్ట్

Rashid Khan

Rashid Khan

Rashid Khan: ఆసియా కప్‌ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్‌ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 292 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే విజయం దిశగా అడుగులేసిన ఆఫ్ఘన్ జట్టు చివరికి రెండంటే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై సూపర్-4 అవకాశాన్ని చేజార్చుకుంది. ఆఫ్ఘన్ సూపర్-4కు చేరాలంటే 37.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ క్రమంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు సూపర్-4కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా రషీద్ ఖాన్‌ పోస్ట్ చేశారు.

Also Read: Rahul Gandhi: ‘ఇండియా’, ‘భారత్‌’ పేరుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!

“క్రీడలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు నేర్చుకోండి, ఎదగండి, బలంగా తిరిగి రండి. ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు” అని రషీద్ ట్విట్టర్‌లో రాశారు. ఆసియా కప్ 2023లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక రెండు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను తృటిలో ఓడించింది. తద్వారా శ్రీలంక టోర్నమెంట్ సూపర్ 4లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేయగా, ఓపెనర్ పాతుమ్ నిశ్శంక 41, కరుణరత్నె 32, అసలంక 36, దునిత్ వెల్లలగే 33 (నాటౌట్), తీక్షణ 28 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ మెరుపు వేగంతో ఆడింది. అయితే, వికెట్లను క్రమం తప్పకుండా పారేసుకోవడంతో ఓటమి పాలైంది. 37.4 ఓవర్లలోనే 289 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు బోల్తాపడింది. కాస్తంత నిదానంగా, తెలివిగా ఆడివుంటే ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉండేదే. ప్రణాళిక లోపమే జట్టుకు శాపంగా మారింది.