Site icon NTV Telugu

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?

Rajya Sabha

Rajya Sabha

Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.

ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాలను చూస్తే 97 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు. సభలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కి 29, తృణమూల్ కాంగ్రెస్‌కి 13 మంది, డీఎంకే, ఆప్‌లకు 10 మంది, బీజేడీ, వైఎస్ఆర్సీపీకి 9 మంది, బీఆర్ఎస్‌కి ఏడుగురు, ఆర్జేడీకి ఆరుగురు, సీపీఎంకి ఐదుగురు, ఏఐడీఎంకే, జేడీయూలకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.

Read Also: YSRCP: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్.. పార్టీ బంపర్ ఆఫర్!

మంగళవారం ఎన్నికలు జరిగిన 56 సీట్లలో 41 ఏకగ్రీవం కాగా.. 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 56 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ 30 స్థానాలను దక్కించుకుంది. దీంతో బీజేపీకి మొత్తంగా 97 ఎంపీలు ఉండగా.. ఎన్డీయేకి కలిపి 117 ఎంపీల సంఖ్యా బలం ఉంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. మెజారిటీకి 121 మంది సభ్యులు అవసరం. అయితే, ప్రస్తుతం బీజేపీకి మెజారిటీకి నలుగురు మాత్రమే తక్కువగా ఉన్నారు.

కర్ణాటకలో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. రెండింటిని ఎస్పీ గెలుచుకుంది. నిజానికి బీజేపీకి సొంతగా 7 స్థానాలు గెలుచుకునే అవకాశమే ఉన్నప్పటికీ.. ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో మరో స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకైక స్థానాన్ని బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలువలేకపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి ఓటేయడంతో కమలం అభ్యర్థి గెలుపొందారు.

Exit mobile version