Site icon NTV Telugu

Drug Racket Busted: పాన్ మసాలా మాటున డ్రగ్స్ దందా.. అంతర్రాష్ట్ర పెడ్లర్ అరెస్ట్

Drugs

Drugs

Drug Racket Busted: ​హైదరాబాద్ (పేట్‌బషీరాబాద్) నగరంలో నిర్మాణ రంగం, ఇంటీరియర్ డిజైనింగ్ పనుల కోసం రాజస్థాన్ నుండి వలస వచ్చిన కళాకారులే లక్ష్యంగా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్‌బషీరాబాద్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ఛేదించింది.

​పాన్ మసాలాలో కలుపుకుని..
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ మరియు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన చాలా మంది కళాకారులు (Artisans) మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వీరు ఎండీఎంఏ (MDMA), నల్లమందు (Opium) వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను పాన్ మసాలాలలో కలుపుకుని సేవించడం పరిపాటిగా మారింది. సొంత ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు భారీ మొత్తంలో ఈ డ్రగ్స్‌ను తీసుకువచ్చి, తోటి రాజస్థానీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Drugs Party: గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 12 మంది అరెస్ట్..!

​నెల రోజులుగా నిఘా..
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. గత ఒక నెల రోజులుగా నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాయి. ఈ సంయుక్త ఆపరేషన్‌లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు.

​రూ. 15 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్:
రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న రాజేందర్ @ రాజు భాకర్ (31) అనే ఇంటీరియర్ డిజైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి వాణిజ్య పరిమాణానికి (commercial quantity) 20 రెట్లు ఎక్కువగా ఉన్న 200 గ్రాముల MDMA మరియు 60 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని అంచనా.

TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!

నిందితుడు రాజేందర్ 8వ తరగతి మధ్యలోనే మానేసి హైదరాబాద్ వచ్చి కార్పెంటర్, ఇంటీరియర్ డిజైనర్‌గా స్థిరపడ్డాడు. మత్తుకు బానిసైన ఇతను, ఇక్కడ డిమాండ్ పెరగడాన్ని గమనించి.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన సప్లయర్లు ధన్‌రాజ్, అనిల్, ముఖేష్‌ల నుంచి డ్రగ్స్ సేకరించి నగరానికి తెచ్చేవాడు. ఇక్కడ గ్రాముకు రూ. 5000 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ​ప్రస్తుతం ప్రధాన సప్లయర్లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న పలువురు వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు.

Exit mobile version